విత్తన నూనెలు ఆరోగ్యానికి హానికరమా, పొద్దుతిరుగుడు, ఆవ నూనెలు కూడా ప్రమాదమేనా?

సన్‌ఫ్లవర్ , ఆవనూనె (కనోలా నూనె) లాంటి విత్తన నూనెలు ఆరోగ్యానికి హాని చేస్తాయనే వివాదాస్పద వాదనలు ఇటీవల బయటకొచ్చాయి. ఇందులో నిజం ఉందా?

మీ వంటగది అల్మారాలో ఎక్కడో ఒకచోట ఓ బాటిల్ సన్‌ఫ్లవర్ ఆయిల్ లేదా ఆవనూనె ఉండొచ్చు. మీరు ఆ నూనెలతో వంట చేయవచ్చు. లేదంటే సలాడ్స్‌పై చల్లుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా విత్తన నూనెలు చాలా ప్రసిద్ధి పొందాయి.

కొన్నేళ్లుగా సీడ్ ఆయిల్స్‌పై సోషల్ మీడియాలో లెక్కలేనన్ని పోస్టులు కనిపించాయి. ఈ నూనెలు ‘హానికరం’, ‘విషపూరిత’మని, ఆరోగ్యానికి చేటు చేస్తాయనేది ఆ పోస్టుల సారం. ముఖ్యంగా ఎనిమిది రకాల సీడ్ ఆయిల్స్‌ను ‘ది హేట్‌ఫుల్ ఎయిట్’గా విమర్శకులు పిలుస్తున్నారు.

వీటిలో కనోలా, కార్న్, కాటన్‌సీడ్, గ్రేప్ సీడ్, సోయ, రైస్ బ్రాన్, సన్‌ ఫ్లవర్, సాఫ్లవర్ వంటి ప్రముఖ ఆయిల్స్ ఉన్నాయి. ఇవ్వన్నీ గుండె సంబంధిత వ్యాధులకు, టైప్ 2 డయాబెటిస్‌కు కారణమవుతున్నాయంటూ ఆరోపిస్తున్నారు.

గుండె ఆరోగ్యంతో ముడిపడి ఉన్నాయా?
సీడ్ ఆయిల్స్‌లో అధికంగా ఉండే ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌ గురించే ఎక్కువ విమర్శలు వినిపించాయి. ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు ఆరోగ్యానికి అవసరమైనవి. వీటిని మన శరీరం సొంతంగా ఉత్పత్తి చేసుకోలేదు.

ఒమేగా-6 ఆమ్లాలు, క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమవుతాయని, దీనివల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఇటీవల కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు.

కానీ, ఒమేగా-6 ఆమ్లాల వల్ల ఇన్‌ఫ్లమేషన్ పెరగదని శాస్త్రీయ పరీక్షలలో తేలినట్టు మసాచుసెట్స్‌లోని టఫ్ట్స్ యూనివర్సిటీకి చెందిన మెడిసిన్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్, పుడ్ డైరెక్టర్ డారిష్ మొజాఫారియన్ తెలిపారు.

”ఒమేగా-6 ఆమ్లాలు, లిపోక్సిన్లు వంటి శక్తిమంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండే ప్రత్యేక సహజ అణువులను ఉత్పత్తి చేస్తాయని కొత్త పరిశోధన చూపుతోంది” అని ఆయన వివరించారు.

అమెరికాలో దాదాపు 30 ఏళ్ల పాటు 2 లక్షలకు పైగా ప్రజలపై వారి ఆహార, ఆరోగ్యాలపై అధ్యయనం చేశారు.

సీడ్ ఆయిల్స్ సహా మొక్కలకు సంబంధించిన నూనెలు వినియోగించిన వారు గుండె సంబంధిత లేదా క్యాన్సర్ వ్యాధులతో చనిపోయే అవకాశం తక్కువగా ఉందని ఈ అధ్యయనం ద్వారా పరిశోధకులు గుర్తించారు.

మరోవైపు, వెన్న ఎక్కువగా తీసుకునే వారికి ఈ ప్రమాదం ఎక్కువగా పొంచి ఉందని సూచించారు.

మన ఆరోగ్యంపై ఒమేగా-6 చూపించే ప్రభావాలను పరిశోధిస్తున్న అనేక అధ్యయనాలు, సీడ్ ఆయిల్‌లో పుష్కలంగా లభించే లినోలెయిక్ అనే ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లంపై ప్రధానంగా దృష్టి సారించాయి. ఇది మన రక్తంలోని చెడు ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని గుర్తించారు.

రక్తంలో లెనోలెయిక్ ఆమ్లం అత్యధిక స్థాయిలో ఉన్నవారికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తక్కువగా ఉన్నట్లు జాన్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన హ్యుమన్ న్యూట్రీషన్ ప్రొఫెసర్ మ్యాటీ మార్క్‌లండ్ 2019లో చేసిన అధ్యయనం ద్వారా తెలిసింది.

విత్తన నూనెల నుంచి లభించే ఒమేగా- 6 కొవ్వు ఆమ్లాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల వ్యాధులు, మరణాల వంటి ప్రమాదాలు పెరిగే అవకాశం లేదని డబ్ల్యూహెచ్‌వో అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు తేల్చారు. కానీ, దీనికి మరింత నాణ్యమైన పరిశోధన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

విత్తన నూనెలను ఎలా శుద్ధి చేస్తారు?
విత్తన నూనెలను హెక్సేన్ అనే రసాయనంతో తీస్తారని కొన్ని ఆందోళనలు ఉన్నాయి. క్రూడాయిల్ నుంచి హెక్సేన్ తయారవుతుంది. అయితే, ఈ ప్రక్రియ సమస్యలకు దారి తీస్తుందని సూచించే ఆధారాలు ఇప్పటివరకు లేవు.

”ఆహార శుద్ధిలో హెక్సేన్ సారాన్ని వాడటం చాలా సాధారణమని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అయితే డీయోడరైజింగ్, బ్లీచింగ్ వంటి ప్రక్రియలతో అందులోని హానికర సమ్మేళనాలు తొలగిపోతాయి” అని అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ ప్రివెన్షన్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన న్యూట్రీషన్ స్టడీస్ డైరెక్టర్ క్రిస్టోఫర్ గార్డెనర్ చెప్పారు.

గానుగ ఆడించి తీసిన విత్తన నూనెల్లో ఈ ప్రక్రియ ఉండదు. కానీ, ఇలా తయారుచేసిన నూనె ఖరీదు ఎక్కువగా ఉంటుంది.

ట్యూమర్ల పెరుగుదలకు ఆజ్యం పోస్తాయా?
ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలతో మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలను చూపించే పరిశోధనలు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఒక నిర్దిష్ట రకమైన రొమ్ము క్యాన్సర్ పెరుగుదలకు ఈ ఆమ్లాలు ఆజ్యం పోస్తాయని ఇటీవలే పరిశోధకులు కనుగొన్నారు.

క్యాన్సర్ కణాలు, మన తినే ఆహారంలోని పోషకాలను ఇంధనంగా ఉపయోగించుకొని శరీరంలో వృద్ధి చెందుతాయి.

అయితే, ఇందులో ఒమేగా-6 ఆమ్లాలు పోషించే పాత్రను చూపించే పరిశోధనలు పరిమితంగా ఉన్నాయి.

”మన ఆరోగ్యానికి ఒక విధంగా ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీరు వీటిని పూర్తిగా తీసుకోవడం మానేస్తే దుష్ప్రభావాలు ఉండొచ్చు” అని న్యూయార్క్‌లోని వీల్ కార్నెల్ మెడిసిన్ రీసెర్చ్ సెంటర్ పోస్ట్‌ డాక్టోరల్ అసోసియేట్ నికోలస్ కోండౌరస్ చెప్పారు.

ఆరోగ్యానికి ఏది మంచిది?
విత్తన నూనెల్లో మిగతా వాటితో పోలిస్తే కనోలా నూనె, సోయాబీన్ నూనెలపై ఎక్కువ అధ్యయనం జరిగింది. కాబట్టి వీటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి.

” ఈ రెండింటిలోనూ మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్, ఒమేగా-6 పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, ఒమేగా-3 పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ సహా ఆరోగ్యకర కొవ్వుల సమతుల్యత ఉంటుంది” అని మొజాఫారియన్ అన్నారు.

కనోలా నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయని, ఆలివ్ ఆయిల్‌ కంటే ఇది మెరుగ్గా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగుపరుస్తుందని ఆయన చెప్పారు.

సన్‌ఫ్లవర్ నూనె కంటే కనోలా ఆయిల్‌తో చెడు ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గుతుందని, ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్‌ ఉన్నవారు బరువు తగ్గడంలో ఉపయోగపడుతుందని 27 ట్రయల్స్‌పై చేసిన ఒక విశ్లేషణ ద్వారా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

శాచురేటెడ్ ఫ్యాట్స్‌తో పోలిస్తే సోయాబీన్ ఆయిల్‌, కొలెస్ట్రాల్‌ స్థాయిని మెరుగుపరుస్తుందని గుర్తించారు.

సోయాబీన్ నూనెను ఎక్కువగా వినియోగించే వారిలో ఏ కారణం వల్లనైనా కలిగే మరణముప్పు తక్కువగా ఉందని ఓ అధ్యయనం తేల్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *