నరసాపురం -అరుణాచలం (తిరువణ్ణామలై) మధ్య ప్రతి బుధవారం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు తెలియచేసింది. 07219 నెంబరుతో ఈ రైలు ప్రతి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు నరసాపురంలో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలకు అరుణాచలం చేరుకుంటుంది.
తిరిగి 07220 నెంబరు గల రైలు గురువారం మధ్యాహ్నం 11 గంటలకు అరుణాచలం (తిరువణ్ణామలై) నుండి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజూము 3 గంటలకు నరసాపురం వస్తుంది. ఆగస్టు నెలాఖరు వరకు పాలకొల్లు, భీమవరం జంక్షన్, టౌన్, ఆకివీడు, గుడివాడ, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, వెల్లూరు మీదుగా నడుస్తుం దన్నారు.
రాష్ట్రం నుంచి నేరుగా అరుణాచలం వెళ్లే తొలి రైలు ఇదే కావడం గమనార్హం.
ప్రస్తుతం అరుణాచలం వెళ్లాలంటే తిరుపతి, కాట్పాడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లాల్సి ఉంది. విజయవాడ నుంచి వారానికి నేరుగా ఒక్క రైలు మాత్రమే అరుణాచలం మీదుగా నడుస్తోంది. ఇది ఢిల్లీ నుంచి వస్తుండడంతో రిజర్వేషన్ దొరకని పరిస్థితి. ప్రయాణికుల వినతి మేరకు రైలు వేయడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
